Yaadi....manaadi!!!

 

యాది . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . మనాది!!!

 

అన్నా,

 

నీ విషయం తెలియక చాలా రోజులైయ్యింది, అందరితో మాట్లాడినా ఏం అర్ధం కావటంలేదు..... అంతా భ్రాంతిగా, కలవరింతగా, గాభరాగా, భయంగా ఉంది. ఇంకా ఉండబట్టలేక, నాన్నను ఒకసారి తల్చుకొని, నీకే డైరెక్టుగా రాస్తున్నాను.

 

రాస్తుంటే ఎన్నో గుర్తొస్తున్నాయి.... అప్పుడు నేను బొంబాయి లో ఉన్న, నువ్వు నాకు ఉత్తరం రాసినవు.....which is a rare event! Dearest Yugandar అని మొదలయ్యింది ఉత్తరం..... మా అన్నకు మేమంటే ఇంతిష్టమా అని ఉత్తరం చదవకుండానే ఉబ్బి తబ్బిబ్బయ్యాను, చదవవలిసిన అవసరం లేకుండనే మనసుకు, గుండెకు అర్ధం  అయిపోయింది. పెద్దగా ఉద్బోధ అవసరం లేకుండనే నువ్వు చెప్పేవి చెప్పనివి అన్నీ సహజంగా అర్ధం అయ్యేవన్నా.... నీ మాట వినడమే, గర్వంగా ఉండేది.

 

నాన్న కాప్రా లో ఉన్న టైం కావొచ్చు... సైకిల్ మీద నన్ను వి వి అప్పర్ ప్రైమరీ కు తీసుకొనిపోయి అక్కడ వైస్ ప్రిన్సిపల్ తో మాట్లాడి అడ్మిషన్ చేయించినవ్.... అప్పుడు ఫాదర్ ఫిగర్ అనే మాట నాకు తెలిసే అవకాశమే లేదన్న.....but you were a father figure right from the beginning! మొదటి రోజు స్కూల్ అయినంక అందరు వెళ్లిపోతుంటే, నీకోసం ఎదురుచూస్తూ ఒక్కటే ఏడుపు.... నువ్వొచ్చి 'ఎందుకురా భయం' అంటే కొండంత ధైర్యం. ఆరోజు ఎదురుచూసినట్లే ఈరోజు కూడా.... నువ్వు మమ్మల్ని వొదిలి పోనని ఒట్టు పెట్టన్నా.

 

అమ్మ, నాన్న మనందరి ఫొటోస్, ఫోటో ఫ్రేమ్స్ అప్పుడప్పుడు చూసి, చూపించి మురిసిపోయి మేమందరం special అనే భావన కల్పించేవాళ్ళు....నీకు అదే అలవాటు. ముఖ్యంగా శేఖర్  గాని రింగుల జుట్టు, టోపీ పెట్టుకొన్న వాడందం చూపెట్టి ... కింగ్, కింగ్ అని మురిసేటొడివి. నిన్ను చూసి అమ్మ, నా కొడుకు ధర్మరాజు, అమాయకుడు అనేదెప్పుడు....మరి  ధర్మరాజు తమ్ములను వదిలి పెట్టి పోతడా? గొల్ల కిర్కీ నుండి గౌలిగూడ వరకు నిన్ను చూసిన వాళ్ళు, కలిసిన వాళ్ళు ఒకటే ముక్త కంఠం....శుభాష్ ఎంత మంచోడు! మంచితనానికి ఎం ఫలితం లేదాన్న?

 

నాన్న ఛాయా మాత్రంగా sahir ludhianvi, kaifi గురించి చెప్తే నువ్వు ప్యాసా, haqeeqat సందర్భంలో వాళ్ళను దగ్గరగా పరిచయం చేసినవ్..... వాళ్లకు తోడు Majrooh, Sailendra లను నేను కలుపుకొని వాళ్ళందరూ మనింటి వాళ్ళే అన్నంత పిచ్చిగా నీతోని మొన్నటి వరకు మాట్లాడిన కదన్నా? నువ్వు 83లో ప్రకృతి హాస్పిటల్ లో ఉండి russian revolution, french revolution చదివి నాన్నతో ఉత్సాహంగా చర్చించింది బాగా గుర్తు.... చైతన్యం పర్యవసనాలు నాన్నకు బాగ  తెలుసు... అందుకే దారిన నిన్ను పోనియ్యలేదు. విప్లవం కన్నా కుటుంబం ముందొస్తే విప్లవకారులుసైతం  తలవంచవలిసిందేమోనన్న? కానీ సమయంలో నీ చైతన్యం, సమరోత్సాహం కన్నుల ముందే ఉంది.... పూర్తిగా సన్నగా, గడ్డం తో ఉన్నా ఎదో మెరుపు, almost a halo! ప్రకృతి హాస్పిటల్ లో ఉన్నా, నా VII marks మెమో  తెమ్మన్నావ్....నేను బిక్కు బిక్కు మంటూ చూపిస్తే, రెండు మార్కులతో 1st రాంక్ పోయింది కదరా అన్నవ్....తన్నులు తప్పినవనిపించినా నువ్వు భాద పడితే తల్లడిల్లి పోతమన్న.

 

ఇంక నేను X th, శేఖర్ VII లో ఉన్నప్పుడు.... ఫైనల్ exams నాలుగు నెల్ల ముందు మాకో స్పెషల్ రూమ్ తయారు చేసినవ్.... ఇద్దరికీ రెండు టేబుల్స్, నైట్ లాంప్స్, కరెంట్ పోతుందని చార్మినార్ నుండి తెచ్చిన రెండు పెద్ద జర్మన్ లాంప్స్....అంతెందుకు శేఖర్కి ఒక కాలింగ్ బెల్! ఉదయం 4 గంటలకి లేపి జాపనీస్ బ్లాక్ కాఫీ.....అవాస్తవాలు  ప్రతిబింబించే సినిమాల్లో కూడా ఇటువంటి దృశ్యాలు అరుదేమోనన్న!  Though our results did not measure up to your unstinting efforts and expectations, you forgave us and took great joy in whatever little we achieved later. మళ్ళీ కొత్తగా ఏదైనా పరీక్షలకు ప్రిపేర్ కావాలుందన్నా...... సారి నేను డికాక్షన్ తయారు చేస్తనన్న.

 

పెళ్లిళ్లలో dictionaries ఇవ్వడమనే సంప్రదాయం నువ్వే మొదలుపెట్టినవన్న.... మాకు శంకర నారాయణ, బ్రౌన్ మొదలు Hornby లను పరిచయం చేసింది నువ్వే, Reader's Digest, Use the right word ఇచ్చింది నువ్వే.... మరి lexicographers అందరికి ఎం సమాధానం చెప్పాలన్నా? online dictionary చూసినా, పద పదంలో నువ్వే కనిపిస్తున్నవ్.... our family dictionary begins with you అన్నా. Hyderabad Book exhibition నన్ను, శేఖర్ని తీసుకొని పోయి 'Greatest Revolutionaries' అనే పుస్తకం కొన్నావు.... దాంట్లోనే Che పరిచయమైయ్యాడు.... జతిన్ పేరులో Guevara జత చేసేంత ప్రభావముందన్నా.... నువ్వు జతిన్ ని Guevara అని పిలిచినప్పుడల్లా సమ సమాజం, విప్లవం వచ్చినంత సంతోషమైయ్యేది....నీలాగా అమాయకంగా, స్వచ్చంగా నవ్వేవాళ్ళు, సంతోషించేవాళ్లు చాలా చాలా అరుదు.... అస్సలు కుళ్ళు, కుతంత్రాల  కాలం లో పుట్టవలిసిన  వాడివి కాదన్న.

 

హిందీ 'bhabhi' చూసి చాలా inspire అని చాలా సార్లు చెప్పినవ్...కానీ Balraj Sahni నీ కన్నా పెద్ద....తోబుట్టువు లను ఇంత అన్యాయంగా వదిలి పెట్టలేదు. దోస్తీ, Omar Mukhtar చూపెట్టినవ్..... నిన్ను దోస్తీ   Omar Mukhtar చూసుకోవాల్నా ? సినిమాలంటే గుర్తొచ్చింది.... భగతన్నా సినిమాలెక్కువ చూస్తున్నడని కోపం ఉన్న, రాముడి వాత్సల్యం లక్ష్మణుడి పై నున్నంత నీకు భగతన్నపైన .... అరె భగత్ చిన్నతల్లి ని కాలేజ్ తీస్కొపోరా, పని చెయ్యిరా , అక్కడికి పోరా.... అస్తమానం నిన్నే వెన్నంటి ఉన్నాడు లక్ష్మణుడు. College గొడవల్లో వాడే ఫైట్ చేస్తుండు, వానికెవ్వడు సహాయం లేడు అని గర్వించే వానివి కదన్న... మర్చిపోకు నీ సహాయం, నీడ మాకెప్పుడు కావాలె సుమా!

 

నీకు ముగ్గురు చెల్లెల్లు....చిన్నప్పుడెప్పుడో తప్ప వాళ్లను కసిరిందెప్పుడు గుర్తు లేదు... నాయన్నమ్మ అంశ శైలక్క తిట్టినా చిరునవ్వే సమాధానం. కాకతీయ అంశ రుద్రక్కంటే ఎంతో గర్వం....నువ్వు శారదక్కను literally బంగారంలాగా చూస్కున్నావు....వీళ్ళందరూ మళ్ళీ నీకు రాఖీ కట్టాలని ఎదురుచూస్తున్నారు....వాళ్ళ ఆశల్ని వమ్ము చెయ్యకన్నా.

 

నీ పెళ్ళైన కొత్తలో ....ఏం నువ్వేమన్నా శ్రవణ కుమారుడివా అన్న కువిమర్శలను అధిగమించి శ్రవణ కుమారుడికే ఆదర్శం మన్నట్లున్నవు.... నాన్నకోసం ఉద్యోగం మానేసి వస్తా అని నువ్వు, ఒద్దు బిడ్డా పిల్లలున్నారు మానెయ్యొద్దు అని నాన్న.... ఎంత తపన, ఎంత తల్లడిల్లి నాన్నకు సేవ చేస్నవన్నా.... Hero లాంటి నాన్న నీ మాటకు ఎంత విలువ ఇచ్చేవాడోనన్న, నీకు కష్టం అయితుందని వయసులో కొత్తగూడెం to హైదరాబాద్ తిరిగేవాడు.... మరి చూడు నువ్వు నాన్నకే హీరో....నీ భాద్యత అయిపోలేదన్న ఇంక  అమ్మని, వదిన, పిల్లలను , మమ్మల్నందరిని చూసుకోవాలె సుమా.    

 

నా/మా కణ కణం నీకోసం కలవరిస్తుంది, పలవరిస్తుంది, ఎదురు చూస్తుంది... నీ సువిశాల కుటుంబం, మేన కోడళ్ళు , మేనల్లుళ్లు, తమ్ముల పిల్లలు పెదనాన్నెడి అని గాభరా పడుతున్నారు. నీ స్కూల్ దోస్తులు, బ్యాంక్ మిత్రులు Bose ఏడని అడుగుతున్నారు.... మన గౌలిగూడ జనాభా కూడా ఎదురు చూస్తున్నారు.

 

గుండెలు కంపిస్తున్నా, మొండి ధైర్యం తో నీ సమాధానానికి ఎదురు చూస్తునన్నా.... మనం Battle of Brest, Stalingrad, Road to Berlin గురించి మళ్ళీ మాట్లాడుకోవాలె. Capitalism నాశనం అయితదనే, విప్లవం దగ్గరలోనే ఉందనే ఆశావాదం పంచుకోవాలె. శైలేంద్ర గొప్పతనం తనివి తీరా నీతో పంచుకోవాలె..... నీకు అత్యంత ఇష్టమైన శైలేంద్ర పాటను గుర్తు చేస్కుంటూ....

 

किसी की मुस्कुराहटों पे हो निसार

किसीका दर्द मिल सके तो ले उधार

किसीके वास्ते हो तेरे दिल में प्यार

जीना इसी का नाम है

 

ఇట్లు

అందరం                                                                  

                           

  

                                  

            

Comments

Post a Comment